కోవిడ్ కారణంగా గత కొన్ని నెలలుగా సంగీత కార్యక్రమాల నిర్వహణ కష్టమైపోతున్న రోజులలో, విశాఖ మ్యూజిక్ అకాడమీ నిర్వహించిన వార్షికోత్సవ సంగీతసభలు విశాఖ రసజ్ఞులకు మధురమైన సంగీతామృతాన్ని పంచిపెట్టాయంటే అతిశయోక్తి కాదు.
2019లో అకాడమీ స్వర్ణోత్సవవేడుకలు నిర్వహించి, కరోనా కారణంగా 2020లో కేవలం 51వ వార్షికోత్సవాలను అంతర్జాలమాధ్యమంలో నిర్వహించిన తరువాత, పరిస్థితికాస్త సర్దుకోవడంతో 52వ వార్షికోత్సవ సంగీతసభలను స్థానిక కళాభారతి ఆడిటోరియంలో 26.11.2021 నుండి 01.12.2021 వరకు ఆరు రోజులపాటు ఆసక్తికరంగా వచ్చికూర్చున్న విశాఖ సంగీతాభిలాషులమధ్య, ఘనంగా విజయవంతంగా నిర్వహించి సంగీతసేవపట్ల తన నిబద్ధతను మరొక్కమారు చాటిచెప్పింది.
వేడుకల శుభారంభం 26.11.21 నాటి సాయంత్రం సరిగ్గా 6.15 ని., వేదికపై అకాడమీ అధ్యక్షులు డా. యస్వీ రంగరాజన్, ఛీఫ్ పాట్రన్ డా. యస్. విజయకుమార్, డైనమిక్ కార్యదర్శి శ్రీ యమ్మెస్ శ్రీనివాస్, కోశాధికారి శ్రీ వీరఘంట చంద్రశేఖర్ గారలు మరియు నాటి సభలో గానం చేయనున్న శ్రీమతి గాయత్రి వేంకటరాఘవన్ గారు ఉండగా, చిరంజీవులు శృతి – లయ లు గానం చేసిన గణపతి ప్రార్థనతో, జ్యోతి ప్రజ్వలనతో జరిగింది. వారి వారి క్లుప్తమైన సందేశాల అనంతరం 6.30నికు ఆరంభమైన శ్రీమతి గాయత్రి వెంకటరాఘవన్ గారి గాత్రసంగీత సభ 10.15ని వరకూ సుమారు నాలుగు గంటలపాటు హాలు నిండుగానున్న విశాఖ రసజ్ఞుల కరతాళధ్వనుల మధ్య రసవత్తరంగా, మనోరంజకంగా సాగింది. దక్షిణామూర్తిపై శ్లోకంతో గురుప్రార్థన అనంతరం శహనవర్ణం, గణపతి ప్రార్థనగా నాటరాగంలో “మహాగణపతిం” కృతి, తరువాత కామవర్థిని రాగంలో “శంకరినిన్నే” కీర్తనను నెరవల్, స్వరకల్పనలతో పూర్తి సంగీత వాతావరణం హాలులో అలముకునేలా వినిపించారు. కేదారగౌళరాగంలో “కొలువుడీ భక్తి” కీర్తన, శ్రుతిరంజని రాగంలో “ఏదారి సంచరింతురా” కీర్తనలు గాయనికిగల గాత్రమధురిమను తెలియజేశాయి. ముఖ్యాంశమైన ఖరహరప్రియ రాగాలాపన, “నడచి నడచి” అనే త్యాగరాజకీర్తన, స్వరకల్పనలు సంగీతప్రియులను ఆనందపారవశ్యంలో ఓలలాడించాయి. అప్పుడు ఆరంభించిన “రాగం-తానం-పల్లవి”, హంసవినోదిని రాగంలో “భగవతి సరస్వతి నమామ్యహం-పరమహంస వినోదిని” అన్న సాహిత్యంతో, మంచి ఉత్తేజభరితంగా నడిచింది.
ఖండజాతి త్రిపుటతాళంతో, రేవతి, హిందోళ, సింధుభైరవి రాగాల రాగమాలిక స్వరకల్పనలతో రసికులను కట్టిపడేసింది. వాయులీనంపై శ్రీ మైసూరు వి. శ్రీకాంత్ తగిన రీతిలో సహకారం అందించి రక్తికట్టించగా, మృదంగంపై శ్రీ పి. యస్ ఫల్గుణ్ మరియు ఘటంపై శ్రీ యమ్. హరిబాబు గారలు దీటైన లయవిన్యాసంతో తమ ప్రతిభను తెలియజేశారు. ఈ కళాకారులు నాలుగు గంటలపాటు ప్రేక్షకులకు సమయం తెలియకుండా జేయడం విశేషం.
రెండవరోజు 27.11.21 నాటి సాయంసంధ్యలో చెన్నై నుండి విచ్చేసిన శ్రీమతి సిక్కిల్ మాలా చంద్రశేఖర్ తన మురళీగానతరంగ డోలికలలో శ్రోతలను ఆనందపరిచారు.
నాలుగుదశాబ్దాల అనుభవమున్న ఈ కళాకారిణి మురళిపై సుధలనందించే మోహనరాగ వర్ణంతో ఆరంభిస్తూ, శుద్ధధన్యాసి రాగంలో “సుభ్రహ్మణ్యేన” అన్న దీక్షితులవారి కృతిని చిక్కని స్వరకల్పనలతో వినిపించారు. తరువాత ఆనాడు స్థిరవాసరం కావడంచేత భుజంగిణి రాగంలో “ఎదుటనున్నాడు వీడే” అన్న అన్నమయ్య రచననూ, ఖరహరప్రియరాగాలాపనతో పాపనాశన్ శివన్ రచన “శ్రీనివాస తవచరణం” అన్న కృతులతో వీనులవిందొనరించారు. తరువాత గౌళిపంతు రాగంలో “కరుణ యేదమ్మా” అన్న మణిప్రవాళ సాహిత్య రచనను, నవరసకన్నడ రాగంలో అందరికీ తెలిసిన “నినువినా” కీర్తనను వేగంగా వినిపించి కరతాళధ్వను లందుకున్నారు. తరువాత కళాకారిణి ధర్మవతి రాగంలో వినిపించిన “రాగం-తానం-పల్లవి”, స్వరకల్పనలో రాగమాలికగా అందుకున్న సామ, హిందోళ, బేహాగ్, రేవతి రాగాలు వాద్యంపై ఆమెకుగల పట్టును తెలియజేశాయి. లలితంగా “జో అచ్యుతానంద, మైత్రీ భజతాం, భజన్ మరియు పహాడీ తిల్లానాలు” శ్రోతలను అలరించాయి. వాయులీనంపై శ్రీ వి వి శ్రీనివాసరావుగారి సహకారం రాగాలాపనలలో, స్వరకల్పనలలో ఒక వైవిధ్యాన్ని చూపి ప్రత్యేకతను సంతరించుకుంది. మృదంగంపై శ్రీ మన్నార్ కోయిల్ బాలాజీ, ఘటంపై డా. తిరుచ్చి కె మురళి తమ తమ ప్రతిభను ప్రదర్శించి ప్రశంసాపాత్రులయ్యారు. ఒకప్పటి సిక్కిల్ నీల కుంజుమణి మురళీగాన విద్వాంసులను గుర్తుకుతెచ్చేవిధంగా సాగింది కచేరీ.
అకాడమీ వార్షికోత్సవ వేడుకలలో సాధారణంగా ఏర్పాటుచేసే సోదాహరణ ప్రసంగాన్ని, ఈమారు ఒక దృశ్యాంశంగా మూడవరోజు అనగా 28.11.21 నాటి ఉదయం 10గంకు స్థానిక “పబ్లిక్ లైబ్రరీ హాలు” లో యేర్పాటు చేసింది. “పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురకృష్ణ విరచితమైన అపూర్వ వర్ణములు” అన్న అంశంపై డా. వడ్లమాని ఫణీంద్రుడు గారు ప్రదర్శించిన వీడియో సంగీతాభిమానులకు ముఖ్యంగా విద్యార్థులకు వర్ణముల విషయంలో చాలా వివరాలను తెలియజేసింది.
గంభీరనాట రాగంలో “ఏ గానములో ఈ సకలజగము లీనమై నర్తించునో – ఆ నాదమే మురళి” అన్న సాహిత్యంతో, “సప్తస్వరములు నా జీవము” అన్న చరణంతో, సప్తస్వరములతో కూర్చిన సప్త చిట్ట స్వరములతో కూడిన స్వీయరచన బాలమురళి వినిపించడంతో ఆరంభమైంది వీడియో. రాగ లక్షణాలను పూర్తిగా తెలియజేసేవిధంగా సంగీతరచన సాగింది.
వాగ్గేయకారులే అవతార పురుషులైనప్పుడు రచన ఎంత గొప్పగా ఉంటుందో మరల చివరను ఆయన వినిపించిన “నీ గరిమగని నీదరిని జేరితిని సదా సామ నిగమమోహిని” అన్న స్వరాక్షర సాహిత్యం తోడిరాగంలో వినిపించడంతో కార్యక్రమం ముగిసింది. మధ్యలో సుమారు గంటసమయం ప్రిన్స్ రామవర్మగారు తన శిష్యులతో కూడి ఆలపించిన చక్రవాక, సౌరాష్ట్ర, సూర్యకాంత రాగాలలో చిట్టస్వరాల రచనలో బాలమురళి ప్రదర్శించిన సాహిత్య సంగీత విలువలను తెలియజేశాయి. ముఖ్యంగా రామవర్మగారు వర్ణం – తానవర్ణంపై తన దృష్టిని సారించడం విశేషం. గంభీరనాటరాగంలోనే సాగిన వర్ణం పాడడానికి సులభమనిపించినా రచన బాలమురళికే సాధ్యం అన్న రామవర్మ మాటలు అక్షరసత్యాలు.
“అమ్మా ఆనందదాయిని – అకార ఉకార మకార రూపిణి – వమ్మ నినునమ్మి బాలమురళి గానమ్ముచేసి ధన్యుడనైతిని ” అన్న సాహిత్యంలో గొప్పతనం
చరణం “శివే శివే శివే వేవేల వరాలరాశివే మొరాలించు” అన్న చరణం, చిట్టస్వర సాహిత్యం ఆయన వివరించిన తీరు అద్భుతం. మంచి విషయాలను ప్రేక్షకులకు తెలియజేసిన కార్యక్రమం సమర్పించారు శ్రీ ఫణీంద్రుడు.
సాయంత్రం 6.15 ని. అకాడమీ ప్రతియేటా అందించే *భక్తజ్ఞానానందతీర్థ ఓగిరాల వీరరాఘవశర్మ అవార్డు*
ఈ యేడు డా. కొల్లూరు(కొత్తపల్లి) వందన గారికి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సన్మాన సభలో ఆమెకు శాలువ, పుష్పమాల, జ్ఞాపిక, సన్మానపత్రము మరియు చందనమాలలతో సత్కరించి పదివేల రూపాయల నగదు బహుమతిని శ్రీ ధార్వాడ మురళికృష్ణగారి చేతులమీదుగా అందించడం జరిగింది.
తరువాత భైరవి అటతాళవర్ణంతో తన గానం ఆరంభించిన వందనగారు, ఓగిరాలవారి రెండు రచనలను రాగాలాపన స్వరకల్పనలతో వినిపించి తన గౌరవాన్ని తెలియజేశారు. మొదటిది జగన్మోహిని రాగంలో “కావవే కమలాక్షి” కాగా రెండవది కానడరాగంలో “మదనారీ వరసుదతి” అన్న రచన. ముఖ్యాంశంగా కాంభోజిరాగంలో త్యాగయ్యరచన “ఎవరిమాట విన్నావో” కీర్తనను రాగభావంతో లెక్కలతోకూడిన స్వరకల్పనలతో వినిపించి ప్రశంశలనందుకున్నారు వందన. తనదైన రీతిలో *సంకీర్ణనడ తిశ్రజాతి రూపకతాళంలో* వరాళి రాగంలో “రాగం-తానం-పల్లవి” ని ఎన్నుకోవడమేగాక రాగమాలికగా కుంతలవరాళి, కోకిలవరాళి, పున్నాగవరాళి వంటి అపురూప రాగాలను చేర్చి అంశానికి మరింత అమృతాన్ని చేర్చి అందించడం గమనార్హం.
సింధుభైరవి రాగంలో తిల్లానాతో ముగిసిన ఆమె గానానికి వాయులీన సహకారం డా. కె వి కృష్ణ, మృదంగ సహకారం శ్రీ కోటిపల్లి రమేశ్, ఘట సహకారం శ్రీ యస్. హనుమంతరావు గారలు యథోచితంగా అందించి మంచి లయవిన్యాసంతో శ్రోతల కరతాళధ్వనులను పొందగలిగారు.
నాలుగవరోజైన 29.11.21వ తేదినాటి సాయంత్రం ప్రఖ్యాత వాయులీన విద్వాంసులు శ్రీ ఆర్. దినకర్ గారు
*I am presenting SOLO – but I am not SO LOW*
అంటూ ఒక *హాస్యగుళికను* సరదాగా అందిస్తూ వీనులవిందైన వాయులీన వాద్యంతో అలవోకగా అంశాలను అందిస్తూ ప్రేక్షకులను మైమరపించారు.
“నెరనమ్మితి” అన్న కానడ అటతాళ వర్ణంతోనే రసజ్ఞుల హృదయాలను చూరగొన్న ఈ విద్వాంసుడు వరుసగా, నాటరాగంలో “నిన్నేభజన”, గానమూర్తి రాగంలో “గానమూర్తి”, ద్విజావంతి రాగంలో “అఖిలాండేశ్వరి”, కీర్తనలను వినిపించారు. పంతువరాళి రాగంలో “అప్పరామ భక్తి” కీర్తనను రాగాలాపనతో, మంచి మనోధర్మంతో కూడిన స్వరకల్పనలనుచేర్చి మనోహరమైన రీతిలో పలికించారు. నాటకప్రియరాగంలో “మారజనని” అన్న తమ గురువుగారైన శ్రీమాన్ ఎన్.సి.హెచ్. కృష్ణమాచార్యులవారి రచననందించి గురుభక్తిని తెలియజేసి మూఖ్యాంశంగా శంకరాభరణ రాగంలో “మనసు స్వాధీనమైన” కీర్తన, తరువాత షణ్ముఖప్రియ రాగంలో “రాగం-తానం-పల్లవి” ని శ్రోతల కరతాళధ్వనులమధ్య వినిపించారు.
సింధుభైరవి రాగంలో “తంబూరి మీటిదవా” అన్న పురందరదాస రచనతో ముగించిన వాయులీనసభ శ్రోతలకు మరపురాని అనుభూతిని కలిగించింది.
మృదంగంపై శ్రీ కే. సద్గురుచరణ్ మరియు ఘటంపై శ్రీ యమ్. సూర్యప్రసాదరావు జంట లయవిభాగాన్ని తగిన రీతిలో పోషించి సభకు న్యాయంచేస్తూ రసజ్ఞుల కరతాళధ్వనులందుకున్నారు.
అయిదవరోజు అనగా 30.11.21 నాడు విశాఖకు చెందిన గాత్రవిద్వాంసులు శ్రీ ప్రాతా కృష్ణమూర్తి గారి గాత్రసంగీత సభ ఉల్లాసభరితంగా సాగింది. కల్యాణిరాగ అటతాళవర్ణంతో సభను ఆరంభించిన గాయకులు సూర్యకాంతం రాగంలో “ముద్దుమోము”, ఆభోగి రాగంలో “సభాపతికి”, నాయకిరాగంలో “రంగనాయకం”, బిలహరి రాగంలో “యింతకన్నా ఆనందమేమి”, కీర్తనలను రాగభావం, సాహిత్యభావం శ్రోతలకు తెలిసే రీతిలో గానంచేసి వారి మెప్పును పొందారు. యదుకులకాంభోజి రాగంలో “హే కామాక్షి” అన్న కృతితో కొత్తవాగ్గేయకారులైన “ఆనందవన్ పిచ్చయ్” ను శ్రోతలకు పరిచయంచేస్తూ, వేగంగా ఉమాభరణం రాగంలో “నిజమర్మములను” కీర్తనను వినిపించారు.
ముఖ్యాంశంగా పూర్వీకల్యాణి రాగాలాపనను మనోహరంగా చేసి, “పరమపావనా రామా” కీర్తనను మంచి నెరవల్ స్వరకల్పనలతో ఆలపించి బేహాగ్ , అభేరి, వరాళి, వంటి రాగాలతో రక్తికట్టించారు కృష్ణమూర్తి.
జనసమ్మోదిని, హంసానంది వంటి అరుదైన రాగాలలో అంశాలతో సభను ముగించేముందు, శ్రీ ధన్వాడ ధర్మారావుగారు మృదంగంపైనా, శ్రీ జి. వెంకటేశ్ గారు మోర్సింగ్ పైనా జంటగా వినిపించిన లయవిన్యాసం శ్రోతలకు మంచి ఆనందాన్నిచ్చింది. శ్రీమతి మంథా శ్రీరమ్య వాయులీన సహకారం హాయిగా సాగి శ్రోతల ప్రశంసలనందుకుంది.
చివరిరోజైన 01.12.21 నాటి సాయంత్రం అకాడమీ తన ప్రతిష్ఠాత్మకమైన “సంగీత కళాసాగర” బిరుదును వైణికవిద్వాంసులైన శ్రీ అయ్యగారి శ్యామసుందరం గారికి సమర్పించింది. *ఈ సందర్భంగా ప్రఖ్యాపనపత్రము, జ్ఞాపిక, శాలువ, పుష్పమాలికలతో పాటు శ్రీ మల్లాప్రగడ శేషగిరిరావుగారు తమ కుమార్తె శ్రీమతి సంధ్యగారి జ్ఞాపకార్థం సమకూర్చిన బంగారు పతకాన్ని వైణికవిదుషి శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబగారి చేతులమీదుగా శ్యామసుందరం గారికి సమర్పించి అకాడమీ సత్కరించింది.*
అకాడమీ అధ్యక్షులు డా. యస్వీ రంగరాజన్, కార్యదర్శి శ్రీ యమ్మెస్ శ్రీనివాస్, కోశాధికారి శ్రీ వీరఘంట చంద్రశేఖర్ మరియు విదుషి మల్లాప్రగడ జోగులాంబ గారలు సభలో పాల్గొని విద్వాంసుని సన్మానించారు.
తరువాత అకాడమీ ప్రతియేడు అందించే ARTIST OF DISTINCTION AWARD ను ఈయేడు గాయని శ్రీమతి మూలా శ్రీలతకు శాలువ, జ్ఞాపిక, పదివేల రూపాయల నగదు బహుమతితో సహా అందించి సత్కరించింది.
అంతేగాక వార్షికోత్సవాలలో ప్రతియేటా అకాడమీ సంగీతాభ్యాసం చేస్తూన్న పేదవిద్యార్థులకు Scholorships రూపంలో ధనసహాయం యిస్తూవస్తూన్న సందర్భంలో యిరువురు *బివికె కళాశాల విద్యార్ధులైన 1. పి. కల్కి అరవింద్ మరియు 2. జి. అమూల్య కూ* యీ వేడుకలలో ఆ స్కాలర్షిప్ లను అందించడం విశేషం.
ఈ ధనసహాయాన్ని స్వర్గీయ శ్రీమతి రాధాసాయిరామ్ మరియు శ్రీమతి వసంతబాయ్ స్మృత్యర్థం అందించడం జరిగింది.
అకాడమీకి విశేష సేవలందించిన *శ్రీ వడ్డిపర్తి నరసయ్య గారిని* అకాడమీ శాలువ, జ్ఞాపికలతో సత్కరించి తన అభిమానాన్ని తెలియజేసింది.
తరువాత జరిగిన శ్యామసుందరం గారి వీణావాదన సభలో మార్దంగికులు శ్రీ వంకాయల వేంకటరమణమూర్తి గారు మృదంగపైనా మరియు శ్రీ యమ్ హరిబాబు గారు ఘటంపైన సహకరించి సభను రసవత్తరం గావించారు.
శ్రీ శ్యామసుందరం గారు జగన్మోహిని రాగంలో “శోభిల్లు సప్తస్వర”, సారమతి రాగంలో “మోక్షముకలదా”, కాపీ రాగంలో “నీవల్ల గుణదోషమేమి”, వసంతరాగంలో “సీతమ్మ మాయమ్మ” కీర్తనలను స్వల్ప స్వరకల్పనలతో వినిపించిన అనంతరం శ్రీ వంకాయల వేంకట రమణమూర్తి మరియు వేంకటేశ్ గారల లయవిన్యాసం ప్రేక్షకులకు మంచి విందును అందించింది.
చక్కనైన మంగళం వినిపించి అకాడమీ వార్షికోత్సవాలకు ముక్తాయింపు పలికారు వైణికవిద్వాంసులు.
ఆరురోజుల సంగీతసభలలో అకాడమీ సభ్యులు శ్రీ వియెస్సెన్ మూర్తి, డా. పేరాల బాలమురళికృష్ణ, శ్రీ వి. నరసయ్య గారలు వ్యాఖ్యాతలుగా, విశ్లేషకులుగా బాధ్యతలు నిర్వర్తించగా, సహకార్యదర్శి శ్రీ టి. కృష్ణారావు, సహకార్యదర్శి శ్రీ ఏ. భుజంగరావు, కార్యవర్గ సభ్యులు శ్రీ యమ్ జ్వాలాప్రసాద్, శ్రీ యమ్ యమ్ ప్రభు, శ్రీ సి హెచ్ దుర్గాప్రసాద్ తదితరులు సహకారమందించి కార్యక్రమాలు విజయవంతమవడంలో తమవంతు పాత్ర పోషించారు.
అధ్యక్షులు డా. యస్వీ రంగరాజన్, కార్యదర్శి యమ్మెస్ శ్రీనివాస్, కోశాధికారి శ్రీ వి. చంద్రశేఖర్ గారల నిర్విరామ కృషికి తగ్గ ఫలితం లభించినదన్న సంత్రుప్తి అకాడమీకి కలిగించిన ఈ వేడుకలు విశాఖ రసజ్ఞుల హృదయాలలో నిలచిపోతాయనడానికి సందేహంలేదు.
శ్రీ వియెస్సెన్ మూర్తి