విశాఖ మ్యూజిక్ అకాడమి తన 53వ వార్షికోత్సవ సంగీత సభలను 25.11.22 నుండి 30.11.22 వరకు ఆరురోజులపాటు లబ్ధప్రతిష్ఠులైన సంగీత కళాకారుల సంగీతసభలతో జరుపుకుంది.
స్థానిక కళాభారతి ఏసి ఆడిటోరియంలో జరిగిన ఈ సభలకు పెద్దసంఖ్యలో రసజ్ఞులైన సంగీతాభిమానులు విచ్చేసి అకాడమీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
మొదటిరోజైన 25.11.22 నాడు అకాడమి ప్రారంభోత్సవ సభను నిర్వహించి ప్రతియేటా సంగీత కళాకారులకు సమర్పించే అవార్డులను, ఉపకార వేతనాలను అందించి వర్ధిష్ణు కళాకారులకు ప్రోత్సాహమందించింది.
దేవి సీఫుడ్స్ అధినేత శ్రీ గద్దె సాంబశివరావుగారు ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ సభలో అకాడమి అధ్యక్షులు డా. యస్వీ రంగరాజన్, కార్యదర్శి శ్రీ యమ్మెస్ శ్రీనివాస్, ఛీఫ్ పాట్రన్ డా. యస్. విజయకుమార్, ఉపాధ్యక్షులు శ్రీ బి.ఏ. రాజారావు, డా. పేరాల బాలమురళికృష్ణ, కోశాధికారి శ్రీ వీరఘంట చంద్రశేఖర్ పాల్గొన్నారు.
“తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్” అని గణపతిని స్తుతించిన శ్రీ వియెస్సెన్మూర్తి గారి ఆహ్వానంతో ఆరంభమైన సభలో ముందుగా ఈమధ్యనే స్వర్గస్థురాలైన వైణిక విదుషీమణి సంగీతకళాసాగర శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబగారికి శ్రద్ధాంజలి పూర్వకంగా రెండు నిముషాలు మౌనం పాటించడం జరిగింది. అనంతరం వేదికపైన ఆసీనులైన వారి సువర్ణ హస్తాలతో జ్యోతి ప్రకాశనం జరిగాక చిరంజీవులు శ్రుతి,లయల గణపతి ప్రార్థనతో సభాకార్యక్రమం ఆరంభించడం జరిగింది. అతిథుల క్లుప్త సందేశాల అనంతరం ముఖ్యఅతిథి శ్రీ గద్దె సాంబశివరావుగారు తమ సందేశంలో అకాడమి నిబద్ధతను, నిర్వహణతీరును మెచ్చుకుంటూ, సంస్థతో అనుబంధం పెంచుకోవాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు.
అకాడమీ ప్రతియేటా సమర్పించే “ఆర్టిస్ట్ ఆఫ్ డిస్టింక్షన్” అవార్డును కుమారి గాయత్రి విభావరి వ్యాకరణంకు సమర్పిస్తూ, శాలువ, మెమెంటో పూలగుచ్ఛంతోపాటు పదివేల రూపాయల నగదు బహుమతిని అందించడం జరిగింది. ఈ నగదు బహుమతికి శ్రీ చిట్టూరి వేంకట వేణుగోపాలశర్మ గారి స్మృతిలో వారి మనుమడు శ్రీ బి.వి. రమణమూర్తిగారు ప్రాయోజకతనందించారు.
అకాడమీ జూన్ నెలలో నిర్వహించిన యువకళాకారుల సంగీతసభలలో ఉత్తమ సంగీత సభకుగాను కుమారి గాయత్రి వరేణ్యకు మొమెంటో, పూలగుచ్ఛముతోపాటు 2116/- రూపాయల నగదుబహుమతిని శ్రీ సిహెచ్ దుర్గాప్రసాదుగారు యేర్పాటుచేయగా అందించారు.
అంతేగాక ఆ సభలలో పాల్గొన్న యితరకళాకారులైన యస్. విష్ణుప్రియ ఇందిర, వల్లభజోశ్యుల తేజస్వి, ప్రీతి, మహతి లకు ప్రోత్సాహపూర్వకంగా ఒక్కొక్కరికి మొమెంటోతో పాటు 1116/- నగదు బహుమతిని అందజేసింది అకాడమి.
అకాడమికి గత కొన్నేళ్ళుగా ఉన్నతమైన సేవలందించిన కార్యవర్గ సభ్యుడు శ్రీ సుసర్ల శ్రీనివాస్ ను జ్ఞాపిక శాలువలతో సత్కరించి తన కృతజ్ఞతను తెలుపుకుంది అకాడమి.
అకాడమి ప్రతియేటా అందించే పేద సంగీతవిద్యార్థుల ఉపకారవేతనాన్ని, ఒక్కొక్కరికి 5000/- చొప్పున్న శ్రీ జి. గుణబాబు, పి. పాపరత్నం, ఏ.యస్.యల్.చంద్రకళ, మరియు కె. శ్రీరామ్ గారలకు అందించింది. ఈ ధనాన్ని అకాడమీకి విరాళంగా శ్రీమతి వైవియమ్ జయశ్రీ, డా. టివి సాయిరాం, మరియు డా. వి. సూర్యకాంతం గారలు అందించడం విశేషం.
సభలో నాటి కళాకారులైన డా. యమ్ లలిత, యమ్.నందినిలతో పాటు పండిట్ ఇమాన్ దాస్ రచించిన “Reimagining one nation one music” పుస్తకావిష్కరణ అధ్యక్షులు డా.యస్వీ రంగరాజన్ గారి చేతులమీదుగా జరగడం ముదావహం.
సభానంతరం జరిగిన డా.యమ్. లలిత మరియు యమ్. నందిని గారల వాయులీనవాద్యసభ ఆసక్తికరంగా రెండుగంటలపాటు సాగింది. బిలహరి రాగ వర్ణంతో ఆరంభమై, “గజాననయుతం” అన్న చక్రవాకరాగ కీర్తనతో ముందుకుసాగి, లతాంగి రాగంలో “అపరాధములన్ని” అన్నకీర్తనలో స్వల్ప రాగాలాపన స్వరకల్పనలతో రసజ్ఞులను సంతోషపరిచారు వాయులీన వాద్యకళాకారుల ద్వయం. ముఖారిరాగంలో “ఏమని నిన్నే” అన్న కీర్తన అనంతరం ముఖ్యాంశంగా తమదైన శైలిలో వినిపించి, బేహాగ్ రాగంలో “సమయమిదే రారా సామి” అన్న జావళితో సభను ముగించారు డా. లలిత మరియు నందిని. వీరికి మృదంగంపై శ్రీ పారుపల్లి ఫల్గుణ్, ఘటంపై జె. స్వామినాథన్ సమయోచిత సహకారం అందించి తమ లయవిన్యాసంతో సభను రక్తి కట్టించారు.
రెండవరోజు 26.11.22 నాటి సాయంత్రం జరిగిన శ్రీమతి విశాఖ హరి(చెన్నయి), గాత్ర సంగీతసభ రసజ్ఞులను ఆనందసముద్రంలో ముంచెత్తి, “స్టేండింగ్ ఒవేషన్” అందజేసేలా చేసింది. సింహాచల క్షేత్రదర్శనంతో పొంగిపోయిన శ్రీమతి విశాఖ హరి, తన గాత్రసభలో కేవలం తెలుగురచనలనే అందించదలచి యితరభాషా వాగ్గేయకారులు రచించిన తెలుగు కీర్తనలను తన ఆంగ్లవ్యాఖ్యాన సహితంగా యే తెలుగువారికీ తీసిపోని రీతిలో అందించడం విశేషం. “Telugu is the language of music” అంటూ భక్తిపారవశ్యంతో, వాగ్గేయకారుల వివరం తెలుపడం, సాహిత్యంపట్ల ఆమెకున్న అభిరుచిని తెలియజేస్తూ ప్రేక్షకుల కరతాళధ్వనుల నందుకుంది.
నారశింహునిపై శ్లోకంతో ఆరంభిస్తూ తన గురువుగారైన లాల్గుడి జయరామన్ రచన బహుదారి రాగ వర్ణంతో ఆరంభించి, వారి రచనే అయిన రాగశ్రీ తిల్లానాతో సభ ముగించడం గురుభక్తిని తెలియజేసింది. వర్ణం తరువాత వరుసగా, గాంగేయభూషణి రాగంలో త్యాగయ్య రచన “ఎవ్వరే రామయ్య నీసరి” అంటూ రామయ్యను భజించి, బిలహరి రాగంలో పట్నం సుబ్రమణ్య అయ్యర్ రచన “పరిదానమిచ్చితే” అంటూ పరుగుతీసి, అద్భుతమైన హమీర్ కల్యాణి రాగాలాపనతో, సంగీత త్రిమూర్తుల శిష్యరికం చేసిన సుబ్బరాయశాస్త్రి రచన “వెంకటశైల” అన్నకీర్తనను వినిపించి వాగ్గేయకారుని గొప్పతనం తెలియజేశారు.
“అలరులు కురియగ ఆడెనదే” అంటూ అన్నమయ్య రచనను తన్మయత్వంతో పాడడమేగాక, నేదునూరి వారిని గుర్తుచేసుకుంటూ గౌరవాన్ని తెలుపుకున్నారు శ్రీమతి విశాఖ హరి. తనపేరును చూచి తనను ఆహ్వానించారేమో అంటూ ఛలోక్తిని పలికారు.
అపురూపరాగమైన కర్ణరంజనిలో ముత్తయభాగవతర్ రచించిన “వాంఛతోను” అన్న కీర్తనను భావయుక్తంగా రాగభరితంగా వినిపించి మూఖ్యాంశంగా రాగం – తానం – పల్లవిని వరాళి రాగంలో “వరాహ నరసింహ బ్రోవవే – సింహవల్లి సహిత” అన్న పల్లవిని చతురశ్రజాతి త్రిపుట (ఆది) తాళంలో వినిపిస్తూ, రాగమాలికగా నళినకాంతి, సామ, మోహన, రేవతి, శ్రీ రాగాలలో రాగభావంతో కూడిన స్వరకల్పనలతో, తగిన సాహిత్యమార్పులతో వినిపించి తాను ఆనందిస్తూ రసికులను ఆనందింపజేశారు.
హరికథలో కూడా నిష్ణాతురాలైన గాయని మొల్లరామాయణంనుండి సీతారామ కల్యాణ గద్యభాగాన్ని రాగయుక్తంగా స్వచ్ఛమైన పలుకుతో వినిపించి ఆశ్చర్యపరుస్తూ, తెలంగాణా తిమ్మక్క రచనను, తదుపరి రాగశ్రీ రాగ తిల్లాననూ వినిపించి సభను ముగించారు.
వాయులీనంపై శ్రీ బి. అనంతరామన్ ఆమెపాడిన ప్రతి రాగసంగతులనూ వాయులీనంపై పలికిస్తూ, సహకారధర్మాన్ని పాటిస్తూ తన నైపుణ్యం ప్రదర్శించగా, మృదంగంపై శ్రీ అర్జున్ గణేశ్, ఘటంపై అనుభవజ్ఞుడైన తిరుచ్చి మురళి తమసహకారంతో మైమరపించడమేగాక చక్కని చిక్కని తనియావర్తనంతో ప్రేక్షకుల ప్రశంసలనందుకున్నారు.
ఆడిటోరియంనుంచి ఒక్కరుకూడా లేవకుండా ఆద్యంతమూ వినడమే సభ ఆనందింపజేసిన విషయాన్ని స్పష్టపరిచింది.
మూడవరోజు 27.11.22నాటి సాయంత్రం గంధర్వగానాన్ని తలపింపజేసే గాత్రసంగీతం వినిపించారు శ్రీ సందీప్ నారాయణ్. అదొక రసగంగా ప్రవాహమే. స్వరప్రస్తారసందోహమే. తానుగానంలో లీనమౌతూ తనతో ప్రేక్షకులను తీసుకుపోవడమే ఈ గాయకుని ప్రత్యేకత అనిపించింది.
చెన్నయి సంగీతజ్ఞులు వర్ణంతో సభను ఆరంభిస్తే సాధారణంగా అది లాల్గుడివారిదే అవుతుంది. అదే ఒరవడిలో మనం అరుదుగా వినే చారుకేశి వర్ణంతో తనగంభీరమైన స్వరంతో ఆరంభించారు తన గానప్రవాహాన్ని సందీప్ నారాయణ్. రీతిగౌళ రాగాలాపన తదుపరి పాడిన “నన్నువిడచి కదలకురా” కీర్తనలో ఆర్తి త్యాగరాజ హృదయాన్ని ఆవిష్కరించింది.
నాగస్వరావళి రాగంలో వైద్యనాథ అయ్యర్ రచన “శ్రీ శంకరగురువరం” కీర్తన, స్వరకల్పన ప్రేక్షకులను పరవశంలో ముంచెత్తాయంటే అతిశయోక్తికాదు. ముఖ్యంగా ఈ కీర్తనలో చక్కనైన చిట్టస్వరం ఆకట్టుకుంది. “సేవిక వీడుమలా చిదంబరం” అంటూ ఆందోళికరాగంలో అందించిన కీర్తన వినసొంపైన రాగభావంతో సాగింది. తదుపరి భైరవి రాగాలాపన గురించి యేమిచెప్పినా తక్కువే. “ఉపచారము” కీర్తనను “జానకి శ్రీపతి” వద్ద అద్భుతమైన నెరవల్ ప్రదర్శనతో వినిపించి, చిక్కని స్వరకల్పనతో తన సంగీతజ్ఞానస్థాయిని తెలియజేశారు. ముఖ్యాంశంగా లతాంగి రాగంలో రాగం-తానం-పల్లవిని “రాజమాతంగీ లతాంగి రక్తభూషణి మనోన్మని” అన్న సాహిత్యంతో రాగమాలిక స్వరకల్పనతో మిశ్రపహాడి, సింధుభైరవి, వినిపించి, మైమరచిపోయిన శ్రోతల కరతాళధ్వనులందుకున్నారు. వకుళభరణం రాగంలో “భజరే శ్రీరామం” అన్న అంశంతో సభను ముగించారు సందీప్ నారాయణ్.
వాయులీనంపై యువకిశోరం శ్రీ విట్టల్ రంగన్ అందించిన దీటైన సహకారం రసజ్ఞుల మనోరంజంకంగా సాగింది. రాగాలాపనలోగాని స్వరప్రస్తారంలోగాని పోటాపోటీగా సాగిన వాయులీన వాద్యంతో విద్వాంసుడు మంచి ప్రశంసలనందుకున్నాడు. మృదంగంపై శ్రీ అర్జున్ గణేశ్ చక్కనైన ముందుచూపుతో గాత్రానికి అనుగుణమైన ముక్తాయిలతో ఘటసహకార మందించిన శ్రీ యమ్. హరిబాబుగారితో కలసి ఉన్నతమైన లయవిన్యాసంతో సభను రక్తికట్టించారు.
నాలుగవరోజు 28.11.22 న విశాఖకుచెందిన వైణిక విద్వన్మణి డా. రామవరపు మాధురీదేవి వీణావాదన సభ ప్రేక్షకులను అలరించింది.
ఆద్యంతం రసవత్తరంగా సాగిన సభలో షణ్ముఖప్రియ రాగంలో “సిద్ధివినాయకం”, కమలామనోహరి రాగంలో మంచి చిట్టస్వరంతో కూడిన “కంజదళాయతాక్షి”, అభేరి రాగంలో మంచి రాగాలాపనతో, “భజరే మానస” కీర్తనలను వినిపించారు మాధురీదేవి. అఠాణా రాగంలో కూడా రాగం వినిపించి వేగంగా “అనుపమ గుణాంబుధీ”, అందించిన తదుపరి లలితరాగంలో “వరలక్ష్మి”, కీర్తన అనంతరం మరింతవేగవంతమైన గంభీరనాటరాగ కీర్తన “శ్రీ జాలంధర మాశ్రయామి” తన సాధనను తెలియజేస్తూ వినిపించారు కళాకారిణి. ముఖ్యాంశంగా కీరవాణి రాగంలో “జటాధర, దిగంబర, హరశివశరణం – శంభోశంకర భవహర లయకర” అన్న పల్లవిని త్రిశ్ర, చతురశ్ర, ఖండ నడలలో, బహుదారి, రేవతి, కాపి రాగమాలికగా వినిపించారు. “ఎంతమాత్రము” అన్న అన్నమయ్య రచన, మంగళంపల్లి వారి రాగమాలిక తిల్లానాలతో సభను ముగించారు మాధురీదేవి. మృదంగంపై అనువైన అనుసరణతో శ్రీ సద్గురుచరణ్, ఘటంపై తనదైన స్పష్టమైన వాద్యనైపుణ్యంతో శ్రీ షీను గోపినాథ్ గారలు అందించిన సహకారం, లయవిన్యాసం శ్రోతల కరతాళధ్వనుల నందుకున్నాయి.
అయిదవరోజు 29.11.22 నాటి సాయంత్రం హాలు నిండిన ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తూ ప్రఖ్యాత గాత్రవిద్వాంసులు “మల్లాది సోదరులు” శ్రీ యమ్. శ్రీరాంప్రసాద్, డా. యమ్ రవికుమార్ గారలు వీనులవిందైన గానాన్ని మూడుగంటలపాటు వినిపించారు. కొన్నిదినాలక్రితమే డాక్టరేట్ పట్టా నందుకున్న శ్రీ యమ్. రవికుమార్ గారిని అకాడమీ దుశ్శాలువతో సత్కరించి అభినందనలను తెలుపడం విశేషం.
“కనకాంగి” అంటూ తోడిరాగ అటతాళవర్ణంతో కచేరీని ఉత్సాహభరితంగా ఆరంభించిన మల్లాది సోదరులు జనరంజని రాగంలో త్యాగరాజస్వామి రచన “స్మరణేసుఖము” కీర్తనను మంచి నెరవల్ కూడా జోడించి వినిపించి వెంటనే దేవగాంధారి రాగంలో “సీతావర సంగీతజ్ఞానము”తో సంపూర్ణమైన సంగీతవాతావరణాన్ని ఆడిటోరియంలో కల్పించారు. పసందైన శుభపంతువరాళి రాగాలాపన శ్రోతలను మైమరపింపజేయగా వారు వినిపించిన “ఎన్నాళ్ళు ఊరకే” అన్న త్యాగరాజకీర్తన తరువాత స్వరకల్పన కరతాళధ్వనులను అందుకుంది. తరువాత డా. యనమండ్ర శ్రీనివాసశర్మగారు ప్రముఖ వాగ్గేయకారత్రయంపై రచించిన చక్కని శ్లోకాన్ని బేగడ రాగంలో వినిపిస్తూ, అరుదుగా వినే సుప్రదీపం రాగంలో “వరశిఖివాహన” కీర్తనను అందుకున్నారు. ముఖ్యాంశంగా సోదరులు వినిపించిన ఖరహరప్రియ రాగంలో స్వాతితిరుణాల్ రచన “సతతం తావక పదసేవనం” అంశం రసవత్తరంగా సాగింది. వారి తండ్రిగారు శ్రీ మల్లాది సూరిబాబుగారు శుద్ధసావేరిరాగంలో స్వరపరచిన నారాయణతీర్థ తరంగం, సింధుభైరవి రాగంలో అన్నమయ్య రచన “నీవుదేవుడవు” అంశాలను మధురంగా వినిపించి సభను శ్లోకంతో ముగించారు సోదరులు. వాయులీనంపై అనుభవజ్ఞులైన శ్రీ హెచ్.ఎన్. భాస్కర్ సహకారం తక్కువసమయంలో తమ రాగజ్ఞానాన్ని మనోధర్మాన్ని చూపించే రీతిలో సాగగా, శ్రీ వంకాయల వేంకట రమణమూర్తిగారి మృదంగ సహకారమూ, యమ్. హరిబాబుగారి ఉపప్రక్కవాద్యమైన ఘట సహకారమూ ఆద్యంతమూ అంశాలలో మాధుర్యాన్ని రెట్టింపుచేస్తూ, ఘనమైన లయవిన్యాసంతో ప్రేక్షకుల ప్రశంసలనందుకున్నాయి.
చివరిరోజు 30.11.22 నాటి సాయంత్రం ప్రముఖ గాత్రవిద్వాంసురాలు సేలమ్ డా. గాయత్రీ వేంకటేశన్ గారి గాత్రసంగీతసభ వేడుకలకు తగిన ముగింపును చేకూర్చింది. ఆనాటి సభలో కాపీరాగవర్ణం, స్వల్పరాగాలాపనతో హరికాంభోజి రాగంలో “ఉండేదిరాముడొకడు” అన్న కీర్తన ముందుగా ప్రేక్షకులను రంజింపజేశాయి. తరువాత ఆభోగి రాగలాపన స్వరకల్పనలతో “నీకెపుడు దయవచ్చునో” అన్న కీర్తన, శుద్ధధన్యాసి రాగంలో దీక్షితర్ రచన “సుబ్రమణ్యేన” కీర్తన సభను రసవత్తర స్థాయికి తీసుకొనిపోయాయి. మోహనరాగంలో “ఎందుకోబాగ తెలియదు”, దేవమనోహరి రాగంలో “ఎవరికై అవతారం” అన్న త్యాగరాజకీర్తనలు వినిపించి ముఖ్యాంశంగా కల్యాణిరాగంలో “ఎందుకో నీ మనసు” అంటూ ఆర్తి నిండిన స్వరంతో త్యాగరాజకీర్తనను వినిపించి డా. గాయత్రి ప్రేక్షకుల కరతాళధ్వనులను అందుకున్నారు. భైరవి రాగ జావళి “ఏలరాడాయెనే”, రాగమాలికలో “రంగనాథ పంచకం”, రాగశ్రీ రాగంలో లాల్గుడివారి తిల్లానాతో సభను ముగించారు గాయనీమణి. సీనియర్ వాయులీన విద్వాంసులు శ్రీ యమ్.ఏ. కృష్ణస్వామి గారు అల్పసమయంలోనైనా అనల్పమైన ప్రతిభను కనపరుస్తూ, గాత్రానికి అనుగుణమైన రీతిలో అనుసరిస్తూ, మంచిరాగాలాపన స్వరకల్పనలతో సహకరించగా, మృదంగంపై నెల్లై ఏ.బాలాజీ, ఘటంపై శ్రీ సరస్వతుల హనుమంతరావు మంచి “ఏంటిసిపేషన్” తో లయవిభాగాన్ని పరిపుష్టం చేశారు.
ఆరురోజులపాటు సాగిన విశాఖ మ్యూజిక్ అకాడమీ 53వ వార్షికోత్సవాలలో ఆరంభంలో శ్రీ వియెస్సెన్మూర్తి, శ్రీమతులు డా. వేదుల సూర్యకాంతం, వై. లక్ష్మిప్రభ, శ్రీరంగం పద్మిని మరియు సునీత గారలు పరిచయవాక్యాలు, చివర డా. పేరాల బాలమురళీకృష్ణగారి సమీక్ష, సభలకు నిండుతనాన్ని చేకూర్చాయి.
చివరిరోజున పేరాలవారి వందనసమర్పణలో ఈ సభల నిర్వహణకు తమ ప్రాయోజకతను సమకూర్చిన శ్రీ ఆదిత్య కందర్ప, Amethyst వారికీ, శ్రీ వాసు ప్రకాష్ చిట్టూరి, శ్రీప్రకాష్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారికీ, శ్రీ ధర్మేందర్ వరదా, నోవస్ గ్రూప్ వారికీ, శ్రీమతి పరిటి రాజ్యలక్ష్మిగారికీ, శ్రీ పివియన్ మూర్తి, విశాఖపట్నం కోపరేటివ్ బేంక్ లిమిటెడ్ వారికీ, శ్రీమతి టేకుమళ్ళ శ్యామల సీతారామస్వామి గారికీ శతాధిక ధన్యవాదాలను తెలియజేశారు.
అకాడమీ కార్యవర్గమంతా కార్యనిర్వహణలో చురుకుగా పాల్గొని అన్నివిభాగాలలోనూ తమ ప్రతిభను కనబరచి వేడుకలు విజయవంతం కావడానికి తోడ్పడుతూ, వారే అకాడమీ బలమని మరొక్కమారు రుజువుపరిచారు.
ప్రతిరోజు ఆడిటోరియం నిండా రసజ్ఞులైన సంగీతాభిమానులు విచ్చేసి వేడుకల సఫలతకు కారణమవుతూ, అకాడమీకి కళాకారులకు ప్రోత్సాహాన్నిస్తూ, ఉత్సవాల సంగీతసభలను చాలారోజులు గుర్తుండేరీతిలో నిలిపారు.
వియెస్సెన్మూర్తి
విశాఖ మ్యూజిక్ అకాడమి